వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ నుంచి తరిగొప్పులకు 50 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు మడికొండ పోలీసు ట్రైనింగ్ సెంటర్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. పొగలు ఎక్కువ కావడం వల్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయగా... డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకి నిలిపివేశాడు. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. ఇంజిన్ అధికంగా వేడి కావడం వల్లే పొగలు వచ్చాయని డ్రైవర్ చెప్పాడు. బస్సు బయలుదేరినప్పటి నుంచే పొగలు వస్తున్నాయని చెప్పినప్పటికీ, అలాగే వస్తాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ బస్సును ఇక్కడి వరకూ తీసుకొచ్చాడని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగలు వచ్చిన బస్సును రోడ్డు పక్కకు నిలిపి వేసి ప్రయాణికులను మరో బస్సులో పంపించివేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సర్పంచుల సంఘం మద్దతు