Brothers Killed in Huzurabad Road Accident Today : వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంత సాగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అన్నదములు అసువులు బాసారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణ ఈ ప్రమాదంలో మృతి చెందారు.
అన్నయ్యను కాజీపేటలో ట్రైన్ ఎక్కించడానికి తమ్ముడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెళ్లే రోడ్డువైపు వెళ్తుండగా గుర్తు తెలియని బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చేతికందివచ్చిన కొడుకుల జీవితాలు అర్ధాంతరంగా ముగియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో తమ పెద్ద కుమారుడికి పెళ్లి చేద్దామనుకుంటుండగా ఈ ఘటన జరగడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
Road accident in Bhupallipally : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత సమ్మయ్య, మనవరాలు అక్షిత మృతి చెందారు. వీరు వెళ్తున్న బైక్ను హనుమకొండ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరూ బస్సు కింద పడి ప్రాణాలొదిలారు. గణపురం మండలం సీతారాంపురానికి చెందిన సమ్మయ్య.. తన మనవరాలిని బొడ్రాయ్ పూజలకోసం తన కుమార్తె ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Brothers Killed in Bhupalpally Road Accident Today : భూపాలపల్లి జిల్లాలోనే జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణలు కోల్పోయారు. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద కారు బోల్తా పడి వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన చెందిన అన్నదమ్ములు ఆశిష్, అభిషేక్లు మృత్యువాత పడ్డారు. టేకుమట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు చోట్ల రక్త సంబంధీకులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలతో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది.
వరుస రోడ్డు ప్రమాదాలు: గత వారం రోజులుగా రాష్ట్రంలో నెలకొంటున్న వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న మెదక్ జిల్లాలో బంధువుల పెద్దకర్మకు వెళ్తుండగా.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున గద్వాల్ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తారో లేదోనని ఆ ఇంట్లో వారంతా ఊపిరి బిగపట్టుకుని వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవీ చదవండి: