ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. నేడు అమ్మవారిని 27 కిలోల కూరగాయలతో అందంగా అలంకరించారు.
ప్రతిఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, పండ్లతో అందంగా అలంకరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఉత్సవాల నిర్వహణలో మార్పులు చేశారు. గతంలో ఆలయ పరిసరాలనూ కూరగాయలతో అలంకరించే అర్చకులు.. ప్రస్తుతం కేవలం 27 కిలోల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. శాకంబరీగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
మరోవైపు ఆలయంలో ప్రత్యేక పూజలను నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, 10 సంవత్సరాలలోపు చిన్నారులకు ఆలయ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నట్లు వివరించారు.
భక్తులు భౌతిక దూరం పాటించేలా ఆలయ సిబ్బంది ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇదీచూడండి: 'పూరీ జగన్నాథ యాత్ర తరహాలో ఉజ్జయినీ అమ్మవారి యాత్ర చేయండి'