రైతులు ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి అధికారులు సిఫారసు చేసిన పంటలను పండించకపోతే రైతు బంధు పథకం కూడా వర్తించదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలుమార్లు స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఏఏ పంటలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయనున్నారు.. వానాకాలం సాగుకు ప్రభుత్వం ప్రకటించననున్న వ్యవసాయ విధానం ఎలా ఉండబోతోంది.. ఇలా అనేక అంశాలపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం(ఆర్‌ఏఆర్‌ఎస్) ఏడీఆర్ పి.జగన్మోహన్‌రావుతో ‘ఈటీవీ భారత్’ ముఖాముఖి నిర్వహించింది.
ప్రభుత్వం పంటల మార్పిడి చేయాలని పదేపదే చెబుతోంది.. కారణం?
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టు సాగు చేసి రైతులు గిట్టుబాటు ధర పొందాలనేది ప్రభుత్వ ఆలోచన. గిరాకీ, సరఫరాతో సంబంధం లేకుండా ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం, మరో పంటను పట్టించుకోకపోవడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రణాళికాబద్ధంగా రైతులు పండించాలని కోరుతోంది. పదే పదే పత్తి వేస్తుంటే భూమి నిస్సారంగా మారుతోంది. అన్ని రకాల పంటలు వేస్తే భూములు సారవంతమవ్వడమే కాకుండా మార్కెట్‌లో పంటలకు గిరాకీ ఉంటుంది.
ప్రభుత్వ విధానంపై మీరు ఎలా కసరత్తు చేస్తున్నారు?
ఉమ్మడి వరంగల్‌లో అత్యధికంగా వరి, పత్తి లాంటివి సాగు చేస్తారు. మెట్ట పంటలు పండే భూముల్లో కూడా వరి సాగుచేస్తున్నారు. దీని ద్వారా భూగర్భ జలం అత్యధికంగా వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించనున్న పంటలను సిఫారసు చేసేందుకు ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పరిశోధన స్థానం తరఫున మా సూచనలు మేం చేయనున్నాం. శుక్రవారం దీనిపై ముఖ్యమంత్రితో సమావేశం ఉంది.
ఉమ్మడి వరంగల్‌లో ఎలాంటి పంటలను మీరు సిఫారసు చేయబోతున్నారు?
వానాకాలం పంటకు నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలో ఆహార భద్రత కోసం కచ్చితంగా వరి వైపు మొగ్గు చూపాల్సిందే. ఈసారి సన్న రకాలను ఎక్కువగా సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. మొక్కజొన్న లాంటి వాటిల్లో అంతర పంటగా పప్పు దినుసులను సాగు చేయాలని చెప్పే అవకాశం ఉంది.
వానాకాలం సాగు నుంచే మార్పులు ఉంటాయా?
ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా వరి పండించాల్సి ఉంటుంది. అది తప్పితే మరే పంట పండదు. మిగతా చోట్ల ఆయా నేలలనుబట్టి పంటలను మార్చవచ్ఛు యాసంగిలో మాత్రం కచ్చితంగా ప్రభుత్వం పంట మార్పును సూచించే అవకాశం ఉంది. మొత్తంగా వరి విస్తీర్ణం తగ్గించాలని చెప్పే అవకాశం ఉంది.
ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతోంది?
భారత వాతావరణ శాఖ అంచనా మేరకు వర్షపాతం సాధారణంగానే ఉంటుంది. మొదట్లో కాస్త ఆలస్యమైనా తర్వాత పుంజుకుంటుంది. గతేడాది కూడా వర్షాలు ఆగస్టులోనే కురిశాయి.
పప్పు దినుసుల వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం?
వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువగా వరి, పత్తి పంటలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈసారి భూసార పరీక్షలనుబట్టి రసాయనాల వాడకం, పంటల సిఫారసు కచ్చితంగా ఉంటుంది. ఆ మేరకు పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. గతంలో గులాబీ పురుగు బెడద వల్ల పత్తిని తగ్గించమని కోరితే రైతులు తగ్గించారు.
పరిశోధన కేంద్రంలో కొత్త వంగడాలు ఏమేం వస్తున్నాయి?
నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. గతేడాది డబ్ల్యూఆర్‌జీ93 కంది రకాన్ని కేంద్రం మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు సిఫారసు చేశాం. రాష్ట్రంలో డబ్ల్యూఆర్‌జీ 97 వంగడాన్ని సిఫార్సు చేశాం. బయోటెక్నాలజీ ద్వారా డబ్ల్యూజీఎల్ 1119 వరి రకం చిరు సంచులకు పంపుతున్నాం. పత్తిలో బీటీ రకాల రూపకల్పన నాలుగో దశలో ఉంది. మరో రెండు దశలు పూర్తయితే ట్రయల్స్‌కు పంపుతాం. ఇక్రిశాట్ సహకారంతో కొత్త రకం కందిపై పరిశోధన చేస్తున్నాం.