ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స కోసం ప్రస్తుతం 250 పడకలు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు నిండిపోవడంతో కరోనా లక్షణాలతో వచ్చే కొత్త వారికి పడకలు ఉండే పరిస్థితి లేదు. ఈక్రమంలో వెంటనే ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ ఆసుపత్రిగా మార్చడం లేదా మరో 250 పడకలను అందుబాటులోకి తెచ్చి కరోనాతో వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చికిత్స చేయాల్సిన అవసరముంది. దీంతోపాటు కేఎంసీ ఆవరణలో నిర్మాణం పూర్తయిన పీఎంఎస్‌ఎస్‌వై ఆసుపత్రిని సైతం అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముంది.
శ్వాస మీద ధ్యాస....
కరోనా కేసులు రోజురోజుకు తీవ్రతరమవుతున్న క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శ్వాస ఇబ్బందులతో వచ్చే వారిని ‘సారి’ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో అందరికీ సరిపడా ఆక్సిజన్ సరఫరాతోపాటు, ఆరోగ్యం విషమించిన వారికి వెంటిలేటర్లను కూడా కొరత లేకుండా అందుబాటులో పెట్టాలి. ప్రస్తుతం ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం కేవలం 20 వెంటిలేటర్లు నడుస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరో 48 వెంటిలేటర్లు ఆసుపత్రికి చేరినా ఇంకా వాటిని బిగించే ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వెంటిలేటర్ల కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా పలువురు సిబ్బంది డబ్బులు చెల్లించిన వారికి వెంటిలేటర్‌ను అమరుస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొవిడ్ మందులు కూడా సరిపడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
అక్కడిలాగే..
ఎంజీఎంలోని కరోనా చికిత్స పొందుతున్న వారికి భోజనం సరిగా అందడంలేదని పలువురు చికిత్స పొందుతున్న వారే సామాజిక మాధ్యమాల ద్వారా ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్కొక్కరి భోజనానికి రూ.56 మాత్రమే అందడంతో గుత్తేదారు తాను ఈ భారం మోయలేనని తెగేసి చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని గాంధీ ఇతర ప్రభుత్వ ఆసుపత్రులో కరోనా చికిత్స పొందుతున్న వారికి రూ.250 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో రూ.200 చెల్లించాలని జీవోలో ఉంది. భోజనం డబ్బులు రూ.200 చెల్లించేలా వెంటనే నిర్ణయం తీసుకొని భోజనం సమస్యను రూపుమాపాలి.
ఫలితాలు సమయానికొచ్చేలా...
ఎంజీఎంలో కరోనా లక్షణాలతో చేరి పరీక్షలు చేసుకునే వారు ఫలితాల కోసం వేచి చూడాల్సి వస్తోంది. కేఎంసీలో వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. ఎంజీఎంలో పరీక్షలు చేశాక ఫలితాలు నాలుగు రోజులకు రావడంతో కొందరు రోగులు ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో వారికి పాజిటివా కాదా అనే విషయం తెలియడంలేదు. పైగా చికిత్స కూడా ఎలా అందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో కేఎంసీలో ఏర్పాటైన ల్యాబ్‌లో ఎంజీఎం ఆసుపత్రి నమూనాలను పరీక్షించేందుకు ఒక మెషిన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే ఫలితాలు ఏరోజుకారోజు వచ్చే అవకాశముంది.
వారికి తగిన జాగ్రత్తలు...
వైద్యులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికే అనేక మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌టెక్సీషియన్లకు వైరస్ సోకింది. ఈక్రమంలో కొందరు వైద్యులు సరిగా రావడం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. చికిత్స అందించే వారు కొవిడ్ బారిన పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించుకునేలా చర్యలు తీసుకోవాలి. మొత్తంగా ఆసుపత్రిపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది.
ఏదీ శుభ్రత....
కరోనా వార్డులో ఎంతో పరిశుభ్రత అవసరం. ఎంజీఎంలోని పలు వార్డుల్లో పీపీఈ కిట్లు, చేతి గ్లౌజులు, మాస్కులు ఎక్కడివక్కడే అపరిశుభ్రంగా వదిలేస్తున్నారని, ఇవెంతో ప్రమాదకరమని ఆసుపత్రిలో పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు పోస్టు చేస్తున్నారు. వాష్‌రూంలు కూడా సరిపడా లేవని, అపరిశుభ్రంగా ఉన్నాయని స్వయంగా చికిత్స పొందుతున్న వారే ఆరోపిస్తున్న నేపథ్యంలో పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి.
ఇవీ చూడండి: 'సర్కారు ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు.. ప్రైవేటుకు పోవద్దు'