విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు... అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేస్తూ ప్రశంసలు కూడా పొందుతున్నారు. ట్విట్టర్ ద్వారా సాయం కోరిన ఓ మహిళకు కాజీపేట పోలీసులు చేయూతనందించారు. లాక్డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి ఇంట్లో తినడానికి నిత్యావసరాలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నీలిమ అనే యువతి మంత్రి కేటీఆర్‌ను, వరంగల్ సీపీ రవీందర్‌ను ట్విట్టర్ ద్వారా వేడుకుంది.
స్పందించిన సీపీ... కాజీపేట జూబ్లీమార్కెట్కు చెందిన నీలిమ కుటుంబానికి నిత్యావసరరాలు అందించాలని పోలీసులను ఆదేశించారు. సీఐ నరేందర్, ఎస్సై అశోక్ కుమార్ కలిసి నీలిమ నివాసానికి వెళ్లి నిత్యావసరాలు అందించగా... కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలీసు వాహనంలో గర్భిణీని ఆస్పత్రికి తరలింపు
మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కాజీపేటలో మేస్త్రీ పనులు చేసుకుంటున్న సూరజ్ అనే వ్యక్తి... నెలలు నిండిన తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. సూరజ్ దంపతుల ఇబ్బందులు గమనించిన పోలీసులు సాయం చేశారు. పోలీసుల వాహనంలోనే హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి గర్భిణీని తరలించారు.