హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయస్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు అదరహో అనిపించాయి. రెండో రోజు గురువారం దాదాపు 16 ఈవెంట్లలో జరిగిన పోటీల్లో అథ్లెట్లు పతకాల కోసం నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. మొత్తం 48 క్రీడా విభాగాల్లో 573 మంది క్రీడకారులు పాల్గొననున్నారు.
మహిళల 1500 మీటర్ల పరుగు పోటీలో పంజాబ్‌కు చెందిన హర్మిలన్ బైన్ 4.5 నిమిషాల్లో పూర్తి చేసి సుదీర్ఘ కాలంగా ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పతకాలు బోణీ చేశారు. కాగా 100 మీటర్ల రేస్‌లో తరుణ్ జిత్ కౌర్ బంగారు పతకం సాధించారు.
ఆటో చోదకుడి బిడ్డకు స్వర్ణం
తమిళనాడుకు చెందిన విత్య రామ్‌రాజ్ 400 మీటర్ల పరుగు పోటీలో స్వర్ణం సొంతం చేసుకుంది. గ్యాలరీ వెలుపల ఉన్న తల్లిదండ్రులతో తన సంతోషాన్ని పంచుకుంది. ఆమె తండ్రి పేరు రామ్‌రాజ్ ఆటోడ్రైవర్. తల్లి గృహిణి. విత్య సోదరి నిత్య కూడా అథ్లెటే. ఇద్దరు కవలలు. ఇక్కడ పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. 2016లో జూనియర్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన విత్య ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో తొలిసారి బంగారు పతకం సాధించింది. తన సోదరి నిత్య స్ఫూర్తితోనే క్రీడల్లో రాణిస్తున్నానని చెప్పింది. నిత్య శుక్రవారం 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడనుంది. తండ్రి ఆటో నడుపుతూ తమను ఈ స్థాయికి చేర్చారని చెప్పింది.
బల్లెం వీరుడు సాహిల్
జావెలిన్ త్రో ఫైనల్ పోటీల్లో హరియాణాకు సాహిల్ సిల్వల్ బంగారు పతకం సాధించారు. 14 మంది పాల్గొన్న పోటీలో సిల్వల్ 77.79 మీటర్లు విసిరి తొలిస్థానంలో నిలిచారు. ఈ పోటీలను ప్రేక్షకులు ఆసాంతం తిలకించారు.
రిక్షావాలా కుమార్తె.. హైజంప్‌లో హవా..
తండ్రి రిక్షా లాగితేనే కుటుంబానికి తిండి.. అయితేనేం కూతురును మాత్రం దేశం గర్వించే అథ్లెట్‌ను చేశారు. గురువారం జరిగిన హైజంప్‌లో పశ్చిమబంగకు చెందిన స్వప్న బెర్మన్ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి రిక్షా లాగుతాడని చెప్పారు. 2018లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించానని, ఇక ఆటకు గుడ్‌బై చెబుతానని, తరచూ గాయాల పాలవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తమకు ప్రోత్సాహం అందించిన కుటుంబసభ్యులు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం ప్రారంభం