Mulugu Police Rescued for Tourist : అర్ధరాత్రి.. దట్టమైన అడవి.. అడవిలో చిక్కుకు పోయామంటూ.. 100కి ఓ వ్యక్తి ఫోన్..! పోలీసుల్లో మొదలైన టెన్షన్.. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్‌లు అప్పటికప్పుడు జిల్లా ఎస్పీ కలెక్టర్‌కి ఫోన్ చేయడంతో బోట్లు తాళ్లతో.. సహాయక బృందాలు అడవి బాటపట్టాయి. సురక్షితంగా అందరినీ అడవినుంచి తీసుకొచ్చారు. ములుగు జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరిలోనూ ఆందోళన కలిగింది.
Mulugu Tourists Rescue Operation : ములుగు జిల్లా జలపాతాలకు పెట్టింది. బొగత, ముత్యంధార జలపాతాల అందాలు చూసేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి.. సందర్శకులు విచ్చేస్తున్నారు. అదేవిధంగా వరంగల్, కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, తదితర చోట్లనుంచి 135 మంది పర్యాటకులు వేర్వేరుగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం.. వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యం ధార జలపాత సందర్శనకు వెళ్లారు.
తక్షణమే చర్యలు చేపట్టిన అధికారులు: సందర్శన పూర్తైన తరువాత.. వారంతా తిరుగుముఖం పట్టంగా.. అప్పటికే సమీపంలోని మామిడి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. దాటేందుకు వీల్లేక పోయింది. వెంటనే తిరుమల్ అనే వ్యక్తి.. అడవిలో చిక్కుకుపోయిన విషయాన్ని డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్.. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో మాట్లాడి తక్షణమే సహాయ బృందాలతో వెళ్లి కాపాడాల్సిందిగా ఆదేశించారు. ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో వెంకటాపురం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. పర్యాటకులను కాపాడేందుకు.. అర్ధరాతి సమయంలో అడవి బాటపట్టాయి. ముందుగా వారెక్కడున్నదీ జాడ తెలియలేదు. ఆ తరువాత.. వారెక్కడున్నదీ తెలిసింది. జిల్లా ఎస్పీ వారితో ఫోన్‌లో మాట్లాడి అందరూ క్షేమంగా ఉన్నదీ అడిగి తెలుసుకున్నారు.
"వెళ్లేటప్పుడు ఎవ్వరైనా పోవచ్చు అనే తీరులో ఫ్లోటింగ్ ఉంది. వచ్చేటప్పుడే వర్షం పెరగడంతో ప్రవాహం పెరిగిపోయింది. మేము అక్కడే ఆగిపోయాము. ఎవరికైనా ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్ లేదు ఎమర్జెన్సీ కాల్స్ కూడా పోలేదు. అక్కడక్కడ తిరిగితే సిగ్నల్స్ వచ్చాయి. తరువాత కాల్స్ చేస్తే రెస్క్యూ టీం వస్తుంది అక్కడే ఉండండి అని చెప్పారు." - బాధితులు
వెంటనే రెస్క్యూ బృందాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఏటూరునాగారం నుంచి ఎన్డీఆర్ ఎఫ్, జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.. నాలుగు బస్సుల్లో ఆహారం, తాగునీరుతో అటవీ ప్రాంతంలోకి రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరాయి. గిరిజనుల సాయంతో.. రాత్రి 3 గంటల సమయంలో పర్యాటకులనందరినీ అత్యంత జాగ్రత్తగా రక్షక బృందాలు అడవి నుంచి వెలుపలకి తీసుకొచ్చాయి. సందర్శకులకు అందరికీ అల్పాహారం.. తాగునీరు అందించారు. తేలు కాటుకు గురైన పలువురికి ప్రథమ చికిత్స చేశారు.
"వర్షాకాలంలో ఇలాంటి ప్రదేశాలను సందర్శించడం మానేయండి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందరికి తెలుసు ములుగు జిల్లా పర్యాటక ప్రాంతం అని కానీ ఈ కాలంలో విజిట్ చేయకపోవడం మంచిది." - ఎస్పీ గౌస్ ఆలం
ముత్యంధార జలపాతం.. వీరభద్రవరానికి 8 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జలపాతం సందర్శనను అటవీ శాఖ అధికారులు నిషేధించినా వెళ్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి: