కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు మనో ధైర్యాన్ని కల్పించడానికి తెలంగాణ ప్రైవేట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో భరోసా దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ భరోసా దీక్ష కేంద్రాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క, భాజపా రాష్ట్ర నాయకులు రాకేష్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు.
కరోనా నేపథ్యంలో జీతాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక ఇబ్బందులతో అధ్యాపకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని.. ఆత్మహత్యలకు పాల్పడిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.. మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగురామన్న