వరంగల్ మహానగర పాలక మండలి ఎన్నికల ముంగిట నగరంలో పర్యటిస్తున్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... అభివృద్ధి కార్యక్రమాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. ఉదయమే హైదరాబాద్ నుంచి నేరుగా కాజీపేట రాంపూర్‌కు చేరుకున్న మంత్రి... వరంగల్ నగరవాసులకు ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1,589 కోట్ల రూపాయలతో నగర ప్రజలకు రోజూ తాగునీటి సరఫరా చేసే విధంగా 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సుమారు లక్షా 77వేల నల్లాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయనున్నారు.
కేటీఆర్ శంకుస్థాపనలు
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో 31కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో 10 కోట్ల 60 లక్షలతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ
ఎల్బీనగర్‌లో షాదీఖానా, మండిబజార్‌లో హజ్‌హౌజ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీపురంలో పండ్ల మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్...24కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. లేబర్ కాలనీలో రెండు పడకగదుల ఇళ్లు, రోడ్లు, చర్చ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి... గరీబ్‌నగర్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శివనగర్‌లో ఆర్యూబీని ప్రారంభించిన మంత్రి.. రంగసాయిపేటలో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు.
ఇవాళ్టి పర్యటనలో రెండువేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై....త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి: ఓరుగల్లులో కేటీఆర్... మిషన్ భగీరథ ప్రారంభం..