Errabelli Fires on AmitShah: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో భాజపా నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు ఎవ్వరూ నమ్మరని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వారివన్నీ బోగస్ మాటలని.. వారికి తెలంగాణ ముఖ్యం కాదని ధ్వజమెత్తారు. హనుమకొండలో ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో కేంద్రంపై ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు చేశారు.
"సభావేదికగా అమిత్ షా అబద్ధాలు ఆడారు. వరంగల్ సైనిక్ స్కూల్, కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చినా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి వైద్య కళాశాలలు ఇవ్వకుండా మోసం చేశారు. పంచాయతీలకు ఇంకా రూ.1,000కోట్లు రావాలి. రాష్ట్రం ఆదాయం.. యూపీ, గుజరాత్‌లో ఖర్చు చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీని ముంచారు. ఉపాధి హామీ నిధుల్లో రూ. 25వేల కోట్లు కోత పెట్టారు. కేసీఆర్ తెలంగాణ గాంధీ. ఆయన కుటుంబమంతా పదవుల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. భాజపా నాయకుల బోగస్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా భాజపా నేతలు అడ్డుకుంటున్నారు." -ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
సభలో అందరూ భారత్ మాతాకి జై అన్నారు కానీ.. ఒక్కరైనా తెలంగాణ జిందాబాద్ అన్నారా అని ఎర్రబెల్లి మండిపడ్డారు. వారికి తెలంగాణ ముఖ్యం కాదని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని చాలా హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. కేంద్రం మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు చేసింది ఒక్కటైనా చూపించండని నిలదీశారు. తెలంగాణలో ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తామని చెప్పిన మోదీ.. మోసం చేశారని ధ్వజమెత్తారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డివిరిచారని విమర్శించారు.
ఇవీ చదవండి: 'స్కానింగ్‌కు ప్రైవేటుకు వెళ్తున్నాం.. మందులూ లేవు'