ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీవర్షాలు, వరదలు వదలడం లేదు. హన్మకొండలోని పలు కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వంద ఫీట్ల రోడ్డు, అమరావతి నగర్ , సమ్మయ్య నగర్, సహకార నగర్, ద్వారకా కాలనీ, సరస్వతీ నగర్, సుందరయ్యననగర్లోని స్థానికులు వరదతోనే సావాహం చేస్తున్నారు. నిత్యావసరాలు కొనేందుకు బయయటకు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ, నాలాలు సరిగ్గా లేకనే వరద కష్టాలు చుట్టుముట్టాయని వాపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలేలోపు అధికారులు స్పందించి నీటిని త్వరగా దిగువకు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వరంగల్ గ్రామీణజిల్లాలో భారీవర్షాలు బీభత్సం సృ ష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ధాటికి వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుకట్ట తెగి వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపైకి వరదనీరు చేరింది. వరద ఉద్ధృతికి జాతీయ రహదారి కోతకు గురైంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరోవైపు చెన్నారావుపేట మండలంలో నెక్కొండ - నర్సంపేట ప్రధాన రహదారిపై లోలెవల్ వంతెన వద్ద నీటి ప్రవాహంలో లారీ చిక్కుకుపోయింది. 12 గంటలు గడవక ముందే వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి ఊర చెరువుకు గండి పడింది. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హుటాహుటిన ఉప్పరపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లాలో పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిప్రవహిస్తున్నాయి. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో మేడివాగు వరద ఉద్ధృతి తీవ్రంగానే కొనసాగుతోంది. ప్రధాన రహదారి కిలోమీటరు మేర మునిగిపోయింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు వరంగల్ నుంచి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేశారు.
రామప్ప సరస్సుకు భారీగా నీరు చేరడంతో 3 ఫీట్ల ఎత్తులో మత్తడి పోస్తోంది. ఫలితంగా పాలంపేట రోడ్డు నీట మునగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం చేపలవేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మేడి వాగు ఉద్ధృతిలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
ఇదీ చూడండి 'యోగీ హయాంలో యూపీలో భారీగా తగ్గిన నేరాలు'