వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో 8,410 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 27 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 22 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఐదుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెల్లరేషన్ కార్డుదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిన రూ. 1500.. బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసుకోని లబ్ధిదారులకు నేటి నుంచి పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలకు అనుబంధంగా ఉన్న మొబైల్ నెంబర్, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ వివరాలతో సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లి డబ్బులు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ప్రజలు బయటకు రాకుండా తాళాలు.. తెరిపించిన కలెక్టర్