ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక కంటైన్మెంట్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కొనసాగుతూనే ఉంది. ఎవరూ లోపలి నుంచి బయటకు, బయటి నుంచి లోపలికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయలు అధికారులే అందిస్తున్నారు.
వరంగల్‌లోని ఎన్‌టీఆర్ నగర్‌లో పారిశుద్ధ్య కార్మికులకు నగర మేయర్ గుండా ప్రకాశ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లిలో ఆటో డ్రైవర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నిత్యావసర సరుకులను అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో కొంత మంది యువకులు లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
జనగామలో జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల వాహనాన్ని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బచ్చన్నపేట మండలం బండానాగారంలో ఈ వస్తువులను పంపిణీ చేయనున్నారు.
ములుగు గ్రామ పంచాయితీ ఆవరణలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గాదెం కుమార్ సుమారు 450 మంది నిరుపేదలు, కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం నిర్వహించారు.