రాష్ట్రంలో జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై ప్రచారాస్త్రాలు సంధిస్తూ పార్టీల నేతలు జోరు పెంచారు. కరోనా ఉద్ధృతి కారణంగా... తొలినుంచి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొనగా.. ఎట్టకేలకు ఈసీ స్పష్టతతో పార్టీలన్నీ కదనరంగంలోకి దూకాయి. జనసమీకరణ లేకుండా.. నేతలంతా ప్రజల వద్దకే వెళ్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్‌లో నామినేషన్ల పర్వం ముగియటంతో పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. ఉదయం నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు డివిజన్లలో పర్యటిస్తూ.. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఏ పార్టీ కేటాయించని రీతిలో బీసీలకు, మహిళలకు తాము పెద్దపీట వేశామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న మంత్రి.. ఎన్నికల్లో భాజపాకు గుణపాఠం చెప్పాలని కోరారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలంటూ.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి డబ్బుకొడుతూ.. ఆమె ప్రచారం సాగించారు. ప్రజల్లో చిచ్చుపెట్టి.. రాజకీయ లబ్ధికోసం కొందరు యత్నిస్తున్నారని.. ప్రజల బాగుకోసం పరితపించే తెరాసకే పట్టం కట్టాలని సత్యవతి కోరారు.
భాజపా, తెరాస హోరాహోరీ..
ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికకు పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అభివృద్ధి నినాదమే ఎజెండాగా తెరాస ప్రజల్లోకి వెళ్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలు, కేంద్ర పథకాలను వివరిస్తూ భాజపా నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా 25, 26 డివిజన్లలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృతంగా ప్రచారం సాగించారు. తెరాస పాలనలోనే ఖమ్మం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న మంత్రి.. ప్రగతికి అడ్డుపడే వారికి బుద్ధిచెప్పాలని కోరారు.
తెరాసపై భాజపా ఛార్జ్‌షీట్..
ఖమ్మంలో ఐదేళ్ల తెరాస పాలకవర్గం వైఫల్యాలపై భాజపా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో అధికార పార్టీ విఫలమైందంటూ 10 అంశాలను ప్రస్తావిస్తూ.. భాజపా ఎన్నికల కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. రెండ్రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
కొత్తూరులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్..
మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరు పురపాలక ఎన్నికకు ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్... పట్టణంలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు భాజపా నేతలు ప్రచారం నిర్వహించారు. పార్టీ నేత సామ రంగారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కాలనీల్లో పర్యటించారు.