వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన బిజీ బిజీగా సాగింది. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పర్యటన...రాత్రి 7 గంటల వరకూ సాగింది. రెండున్నర వేలకోట్ల రూపాయల విలువైన సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి బాటలో నగరం
వరంగల్ వాసులకు తాగు నీరందించేందుకు... 1,589 కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంకు ప్రారంభించారు. పలు చోట్ల డబుల్ బెడ్రూం ఇళ్లు, షాదీ ఖానాలు, సమీకృత మార్కెట్లను ప్రాంభించారు. కేంద్రం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా అనేక అంశాల్లో కేంద్రం మొండి చేయి చూపినా... నగరాన్నిఅభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత గొప్పగా... ఉత్తమ ద్వితీయ శ్రేణి నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
ప్రజలు మోసపోవద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు దూషిస్తే క్షమించే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైతే కేసులకూ వెనకాడబోమని స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై అసత్య ప్రచారంతో యువతలో విషం నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే లక్షా 30 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామన్న కేటీఆర్... ప్రధాని ఇస్తామన్న ఏటా 14 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భాజపా నేతల మాటలు విని ప్రజలు మోసపోవద్దని కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసకే పట్టం కట్టాలని కోరారు.
కేటీఆర్ శాయంపేట సభలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాల్చుతుంటే మంటలు అంటుకోగా...అధికారులు స్పందించి ఆర్పివేశారు.
ఇదీ చూడండి : కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి: గవర్నర్