KishanReddy Fires on Telangana Government : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 8న కాజీపేటకు రానున్న సందర్భంగా.. ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హనుమకొండలో పర్యటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌తో కలిసి.. కాజీపేట అయోధ్యాపురంలో ప్రధాని భూమిపూజ చేసే పీవోహెచ్, వ్యాగన్ల తయారీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై రైల్వే అధికారులతో కిషన్‌రెడ్డి చర్చించారు.
KishanReddy Comments on KCR : అనంతరం హనుమకొండలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణపై ఎలాంటి చిన్నచూపు చూపడం లేదని తెలిపారు. కానీ రాష్ట్రమే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర సర్కార్ ఎంత తొందరగా భూసేకరణ చేసి ఇస్తే.. అంత త్వరగా పనులు ప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్కు అనుగుణంగా.. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు రూ.330 కోట్ల వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించి.. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు.. 33 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివిధ కారణాలతో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాలేదని.. కాజీపేటలో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్‌తో పాటు అదనంగా.. వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా నెలకు 200 వ్యాగన్లు ఇక్కడ తయారవుతాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం మరో ఒకటిన్నర, రెండెకరాల భూమి కావాల్సి ఉందని.. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు తెలిపామని చెప్పారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌ను కలిపే.. పలు జాతీయ రహదారులను నాలుగు లైన్ల రోడ్లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. విభజన చట్టంలోని హామీలైన గిరిజన యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కిషన్‌రెడ్డి వివరించారు.
PM Modi Telangana Tour : ఈ క్రమంలోనే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ఆ హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రత్యేకంగా ఏ పండుగకూ జాతీయ హోదా లేదని.. మేడారానికి జాతీయ పండుగ హోదాపై అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష మార్పుపైనా ఆయన నేరుగా స్పందించకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. తొలిసారిగా చారిత్రక నగరానికి వస్తున్న ప్రధానికి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
"ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్‌లో పర్యటిస్తారు. నెలకు 200 వ్యాగన్‌లు వరంగల్‌లో తయారవుతాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. స్వార్థ రాజకీయాల కోసం అసత్య ప్రచారం చేయవద్దు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి: BJP development works in Telangana : 'మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి ఇదే'
Kishan Reddy Latest News : 'ప్రధాని మోదీ పాలనతోనే సంక్షేమాభివృద్ధి సాధ్యం'