తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి 7 రోజుల పాటు వరంగల్, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం నుంచి ఆలయం వరకు డప్పు, డోలు కళాకారులు, పేరిణి నృత్య కళాకారులు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ వైభవంపై ఏడురోజుల పాటు నాటకాలు, సదస్సులు, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కమల్‌చంద్ర భంజ్‌దేవ్ పేర్కొన్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాకతీయ ఉత్సవాలు జరపడం గర్వంగా ఉందన్న ఆయన.. ఈ వేడుకలకు తనను ఆహ్వానించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషం. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. బస్తర్‌లో మా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాకతీయ ఉత్సవాలు జరపడం గర్వంగా ఉంది. నన్ను ఆహ్వానించిన నాయకులకు ధన్యవాదాలు.-కమల్‌చంద్ర భంజ్‌దేవ్
వారం పాటు ఉత్సవాలు..: కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని మరోమారు ప్రపంచానికి చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించింది.
ఇవీ చూడండి..
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం.. ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు
'టెక్నాలజీ సాయంతో ఉత్పత్తులు పెంచేలా ప్రణాళికలు'
దేశంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్.. 19వేలకు చేరువలో రోజువారీ కేసులు