ప్రజాకవి కాళోజీ, ఆయన సోదరులు రామేశ్వరరావు... తమ పార్థివదేహాలను వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు ఇచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వారి బాటలోనే చాలా మంది తమ దేహాలను విద్యార్థుల ప్రయోగాల కోసం ఇచ్చి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నారు.
మృతదేహాల కొరత
కానీ ఇప్పుడు.... ఆ కళాశాలలో విద్యార్ధుల ప్రయోగాలకోసం మృతదేహాల కొరత ఏర్పడుతోంది. ఏడాదికి కనీసం 40 పార్థివదేహాలు కావాల్సి ఉంది. అడపాదడపా కొంతమంది ఇస్తున్నా.... అవి సరిపోని పరిస్ధితి నెలకొంటోంది.
ముందుకు రావడం లేదు
వైద్య విద్యార్థులు ప్రయోగాలు చేయాలంటే మృతదేహాలు అవసరం. కానీ కుటుంబ సభ్యులు తమ వారి దేహాలను ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో గతంతో పోలిస్తే.... వైద్య విద్యార్ధుల సంఖ్య పెరిగింది కానీ ఆ స్ధాయిలో కళాశాలకు అందడం లేదని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్య తెలిపారు.
అవగాహన కల్పిస్తాం
మతాచారాలు, సంప్రదాయలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు.... చనిపోయిన వారి దేహాలను దహనం చేయడం, ఖననం చేయడం...చేస్తుంటారు. కానీ ప్రయోగాల నిమిత్తం వైద్య కళాశాలకు ఇవ్వడంపై చాలామందికి అవగాహన లేదు. నమ్మకాలతో ముడిపడిన విషయమైనందున దీనిపై పెద్ద ఎత్తున అవగాహన అవసరం. వచ్చే రెండు నెలల్లో..... స్వచ్చంద సంస్ధలతో కలసి పెద్ద ఎత్తున అవగాహనా శిబిరాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.
మానవ జన్మకున్న అవకాశం
వైద్య కళాశాలకు దేహాలను దానం చేయడం అనుకున్నంత సులభం కాదు. కుటుంబసభ్యులకు ఎంతో పెద్ద మనస్సు ఉంటే కానీ ఇది సాధ్యపడదు. అందుకే ఇలా దానమిచ్చిన దాతల శరీరాలను ఉపయోగించేముందు... విద్యార్ధులంతా వారి కాళ్లకు నమస్కరించి... ప్రయోగాలకు ఉపక్రమించేలా.. కచ్చితమైన ఆదేశాలను కళాశాల ప్రిన్సిపల్ జారీ చేశారు. అవయవ దానం, శరీర దానం... ఇలా మనం లేకపోయినా.... మన దేహం ఇతరులకు ఉపయోగపడడం.... మానవ జన్మకు మాత్రమే లభించిన అరుదైన అవకాశమన్నది ఎవరూ కాదనలేని నిజం...
- ఇదీ చూడండి : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్, హరీశ్ హర్షం