Nobel Peace Prize Winner Kailas Satyarthi interacting with students: బాలల హక్కుల పరిరక్షణ, విద్యావకాశాలు.. బాల్యవివాహాల నిరోధానికి కల్యాణ లక్ష్మి, బాలికార్మిక వ్యవస్థ రద్దు కోసం.. తెలంగాణ సర్కార్ చేపట్టిన పథకాలు బాగున్నాయంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ధి కొనియాడారు. చిన్నారుల హక్కులను కాలరాయకుండా వారిపై దాడుల జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదిపై ఉందన్నారు.
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సభలో విద్యార్థులతో ముచ్చటించారు. తనకు నోబెల్ బహుమతి ఎలా వచ్చిందో.. విద్యార్థులకు కైలాశ్ తెలియచేస్తూ.. లైంగిక దాడులను మౌనంగా భరించకుండా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే అవి తగ్గుముఖం పడతాయని బాలలకు సూచించారు. కులమతాలను పక్కన పెట్టి.. దేశమంతా ఒకటేనని.. మనుషులంతా ఒక్కటే అన్న భావన కలిగి ఉండాలని ఉద్భోధించారు. మన కోసం కలలు కనకుండా సమాజం బాగు కోసం కలలు కని వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. బాల కార్మికులు ఎక్కడ కనపడినా వివరాలు అధికారులకు తెలియచేయాలని కోరారు.
"మిమ్మల్ని ఎవ్వరైనా చెడు బుద్ధితో ముట్టుకుంటే బయటకు చెబుతారా? బయటకు చెబితే తల్లిదండ్రులు ఏమైనా అనుకుంటారని ఆలోచన చేయవద్దు. అతను మీ బంధువైనా, కుటుంబ సభ్యులైనా.. చెడు బుద్ధితో ముట్టుకుంటే బయటకు చెప్పాలి. అప్పుడు ఎలాంటి నేరాలకు ఆస్కారం ఉండదు." - కైలాశ్ సత్యార్థి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
బాలల హక్కుల పరిరక్షణ, వారికి విద్యావకాశాలు, భద్రతపై ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బాలకార్మికులు లేరని స్పష్టం చేశారు. వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు సభకు హాజరయ్యారు. కైలాశ్ సత్యార్థి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, చప్పట్లు కొడుతూ హుషారుగా.. కార్యక్రమంలో పాల్గొన్నారు.
"తెలంగాణ రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో పిల్లలు పని చేయడం లేదు.. జిల్లా కలెక్టర్లు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించారు. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వారి పిల్లలకు సైతం రక్షణ కల్పిస్తున్నాము." - వినోద్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి: