Junior Panchayat Secretary Suicide : వరంగల్ జిల్లాలో ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శి సోనీ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. సమ్మె విరమించి నిన్న విధుల్లో చేరిన సోనీ.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాక పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు.
మొన్నటి వరకు జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెలో పాల్గొన్న సోనీ.. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో నిన్న తిరిగి విధుల్లోకి చేరింది. విధులు ముగించుకుని ఇంటికొచ్చాక ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందింది. సోనీ మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రికి చేరుకున్న తోటి ఉద్యోగులు.. కంటతడి పెట్టారు. కార్యదర్శులు ఆసుపత్రికి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
సోనీ.. ఇంటి కోసం రూ.16 లక్షల రుణం తీసుకుందని.. సమ్మె కారణంగా జీతం రాదని.. తీసుకున్న లోన్ డబ్బులు ఎలా కట్టాలని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లి తెలిపారు. కుటుంబ తగాదాలు.. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి సోనీ మృతికి దారి తీసిన వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఆత్మహత్య చేసుకున్న సోనీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం జరిగిన అనంతరం అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకుని నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో నిరసన దీక్ష చేపట్టారు. పోలీసులు వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు.
15 రోజులుగా ఆగని సమ్మె..: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జేపీఎస్‌లు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. కలెక్టరేట్లు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జేపీఎస్‌లు తమ నిరసనలను ఆపేసి విధుల్లో చేరాలని ఇటీవల ప్రభుత్వం హెచ్చరించింది. 9వ తేదీ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జేపీఎస్‌లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వ హెచ్చరికను ఖాతరు చేయని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదే లే అంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి..
Govt on JPS Strike : 'ఇవాళ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం'
JPS Dharna In Whole State : జేపీఎస్‌ల వినూత్న దీక్ష...ప్రభుత్వం దిగివచ్చేనా...?