KTR Speech at Hanamkonda Public Meeting : తెలంగాణలో కుల, మత రాజకీయాలు చేసి.. అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హనుమకొండలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రూ.181 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం హనుమకొండలోని ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌లో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణకు వరంగల్ మణిహారంగా మారబోతుంది: తెలంగాణకు ఇవ్వాల్సిన విభజన హామీలను ఇవ్వకుండా.. రాష్ట్రంలో అశాంతి చెలరేగేలా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్తున్నామన్న ఆయన.. కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను నమ్మి మోసపోకండని ప్రజలకు సూచించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదో తరగతి పేపర్ లీక్ చేశారని ఆరోపించారు. ఐటీకీ సంబంధించిన 8 నుంచి 10 కంపెనీలు వరంగల్‌కు వచ్చాయన్న కేటీఆర్.. తెలంగాణకు వరంగల్ మణిహారంగా మారబోతుందని పేర్కొన్నారు.
'సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. కొత్త ఐటీ కంపెనీలను వరంగల్‌కు తీసుకువస్తున్నారు. అదనంగా 12 వేల మందికి ఇళ్ల పట్టాలు వస్తున్నాయి. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఉంది. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయలేని దరిద్రపు పార్టీ బీజేపీ. ఇంకా కుట్రలు జరుగుతాయి. మతం పేరిట చిచ్చు పెడతారు. చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఓరుగల్లు ప్రజలు ఆలోచించాలి. రూ.1,100 కోట్లతో హెల్త్ సిటీని నిర్మిస్తున్నాం. రూ.640 కోట్లతో గ్రేటర్ వరంగల్‌లో మంచి నీటి సౌకర్యం కల్పించాం'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
ముంబయికి పుణెలా.. హైదరాబాద్‌కు వరంగల్: బీజేపీకి నియ్యతి ఉంటే వరంగల్‌కు ఏం చేశారో ఆ పార్టీ నాయకులు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ దోస్త్‌కు దోచిపెట్టాలి.. దోస్త్ ఇచ్చే కమీషన్‌తో దందాలు చేయాలే.. మతం పేరిట మంటలు పెట్టుడే తప్ప బీజేపీ ఒక్క మంచిపని చేసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ ప్రకటించిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో అనే విషయంపై నిరుద్యోగ యువత ఒకసారి ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తోంది నిరుద్యోగ మార్చ్ కాదు.. రాజకీయ నిరుద్యోగ మార్చ్ అని ఎద్దేవా చేశారు. వరంగల్ అంటే వారసత్వ సంపదే కాదు.. ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ముంబయికి పుణెలా.. హైదరాబాద్‌కు వరంగల్ మారుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇవీ చదవండి: