అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్. వరంగల్ కాశీబుగ్గకు చెందిన ఈయన తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయారు. 2005లో దీపావళికి ఇంటి ముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నూ పోగొట్టుకున్నారు. జీవితం నిండా కారుచీకటి కమ్ముకున్నా భయపడలేదు.. ప్రజాప్రతినిధులు, దాతలు ఓ పాత ఆటో కొనివ్వగా, దాన్ని అద్దెకిస్తూ వచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఎలక్ట్రీషియన్‌గా తనకున్న అవగాహనతో ఆటోకు మరమ్మతులు చేయటం ప్రారంభించిన ఆయన.. ఇపుడు ద్విచక్ర వాహనాల రిపేరింగ్‌నూ మొదలుపెట్టారు. వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గుర్తించి ఇట్టే మరమ్మతులు చేస్తున్న హఫీజ్ పనితనాన్ని గుర్తించిన వాహనదారులంతా ఆయన వద్దకు చేరుతున్నారు. రుణం అందిస్తే మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేసుకుంటానని అంటున్నారు హఫీజ్.
ఇవీ చదవండి: