Ganesh Immersion In Telangana 2023 : ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా వినాయకుడిని గంగమ్మ చెంతకు చేర్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14 చెరువుల వద్ద నిమజ్జనానికి బల్దియా చర్యలు చేపట్టింది. భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, డిజిటల్ స్క్రీన్‌లతో పాటు చలువ పందిళ్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేసింది. మత్య్స, నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జన ప్రక్రియను చూస్తున్నారు.
Ganesh Immersion In Warangal 2023 : వరంగల్ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలను నిషేధించిన సీపీ రంగనాథ్ శోభాయాత్రకు డీజేల అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లతో పాటు తెప్పలను, పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు జి డబ్ల్యూ ఎం ఎస్ కమిషనర్ రిజ్వానా బాషా వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సిద్దేశ్వర గుండంలో మట్టి ప్రతిమలనే నిమజ్జనం చేయాలని మండపాల నిర్వాహకులకు విన్నవించారు.
Ganesh Immersion In Karimnagar : కరీంనగర్‌లో గజాననుడి నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ పరస్పరం విమర్శలు గుప్పించుకొన్నారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకుండా తూతూ మంత్రంగా సమీక్షలతోనే సరిపెట్టారని సంజయ్ ఆరోపించగా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి గంగుల వివరించారు. నిమజ్జనం చేసే కొత్తపల్లి, చింతకుంట, మానకొండూర్ చెరువుల వద్ద క్రెయిన్లు, గజ ఈతగాళ్లతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు..
Ganesh Immersion in Hayathnagar : నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య ఘనంగా గణనాథుడి నిమజ్జన వేడుకలు
''వినాయకుని నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లను చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రత పెంచాము. నిమజ్జనం చేసే చోట గజ ఈతగాళ్లు, పడవలు, క్రేన్లు ఏర్పాటు చేశాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలి''. - గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖమంత్రి
Ganesh Nimajjanam in Nalgonda : నల్గొండ జిల్లాలో నిమజ్జనం కోసం వల్లభరావు చెరువు, చర్లపల్లి భీమ సముద్రం చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. మర్రిగూడ బైపాస్ నుంచి భీమసముద్రం వరకు రోడ్డు రోడ్డు అధ్వానంగా ఉండటంతో మరమ్మతులు చేపట్టారు. నిమజ్జనం చేసే చోట గజ ఈతగాళ్లు, పడవలు, మంచినీటి వసతి, క్రేన్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు..
Ganesh Immersion in Hyderabad 2023 : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు. హైదరాబాద్లో రేపటి నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభం కానున్న వేళ.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సంవత్సరం నిమజ్జనం ఏర్పాట్లను మరింతగా పెంచినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 వేల వినాయక ప్రతిమలను ప్రతిష్టించినట్లు మంత్రి తలసాని వివరించారు. ఎవరు, ఎక్కడ నిమజ్జనం చేయాలో.. ముందుగానే అందరికీ సమాచారం అందించామన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Ganesh Immersion in Hyderabad 2023 : గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ఈసారి మరింత పెంచాం: మంత్రి తలసాని