వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ ఆర్ఈసీలోని బంధం చెరువు వద్ద గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. నిమజ్జనానికి సంబంధించి అధికారులు.. లైటింగ్, క్రేన్, బందోబస్తు వంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులు భక్తుల చేత విశేష పూజలందుకున్న గణపయ్య గంగమ్మ చెంతకు పయనమవ్వగా... భక్తి శ్రద్ధలతో ప్రజలు నిమజ్జనం నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో ఊరేగింపులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో పాటు ఎటువంటి ఆర్బాటాలు లేకుండా నిరాడంబరంగా విఘ్నేశ్వరుణ్ని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఈ సంవత్సరం విగ్రహాల ఎత్తుతో పాటు సంఖ్య కూడా భారీగా తగ్గింది. వైరస్ భయంతో ప్రసాదాల వితరణ కూడా నిలిపివేశారు. నిమజ్జనం కార్యక్రమాన్ని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పర్యవేక్షించారు. అధికారులకు తగు సూచనలు చేసి... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.