Fake Rank Card NIT Warangal Admission : డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్.. ఏ కోర్సులైనా పూర్తి చేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికెట్ వస్తుంది. ఇవన్నీ లేకుండానే కోర్సును బట్టి డబ్బులు తీసుకుని నకిలీ ధ్రువపత్రాలను చేతిలో పెడుతున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి అక్రమార్కులను పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొత్త ముఠాలు పుట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. చేసే మోసాలు పెరిగిపోతున్నాయి.
Warangal NIT Fake Admission Issue : తాజాగా వరంగల్ నిట్‌లోకి నకిలీ ర్యాంక్ కార్డు(Fake Rank Card)తో సీట్ పొందేందుకు ఓ విద్యార్థిని యత్నించడం కలకలం రేపుతోంది. అధికారుల తనిఖీల్లో.. ఆ యువతి నకిలీ ర్యాంక్ కార్డు ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన యువతి మంచి ర్యాంకు రాకున్నా.. వచ్చినట్లుగా నకిలీ కార్డు సృష్టించుకుని.. నిట్‌లో ప్రవేశం పొందేందుకు యత్నించింది. విద్యార్థిని ర్యాంక్ కార్డు, నిట్ అలాట్ మెంట్ పత్రాలు(NIT Allotment Documents) నకిలీవిగా అధికారుల తనిఖీల్లో గుర్తించారు.
పైసలిస్తే.. కోరుకున్న సర్టిఫికేట్.. నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు
Warangal NIT Admission Issue : యువతికి 5 లక్షల ర్యాంకు వస్తే.. దానిని 50 వేలుగా మార్చుకుని ప్రవేశం పొందేందుకు సిద్ధమైంది. నిట్ అధికారుల విచారణలో.. విద్యార్థిని పత్రాలను ఫోర్జరీ చేసినట్లుగా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. రూర్కెలాలో కూడా ముగ్గురు విద్యార్ధులు.. ఇదే తరహాలో సీటు పొందేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కుంభకోణంగా తెలుస్తోంది.
ఫోర్జరీ ద్వారా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం వెనక పెద్ద ముఠానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాసులకు కక్కుర్తి పడి.. ఈ ముఠా.. విద్యార్థులతో కుమ్మక్కై.. నకిలీ ర్యాంక్ కార్డులు, అలాట్ మెంట్ పత్రాలు సృష్టిస్తున్నారు. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(Central Seat Allocation Board) దీనిపై సమగ్రంగా విచారిస్తే.. మరిన్ని అక్రమ ప్రవేశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి మోసాలను కట్టడి చేస్తేనే.. ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుంది.
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు
దేశంలోని నిట్‌లలో వరంగల్‌కు మంచి గుర్తింపు ఉంది. కొందరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు వచ్చినా కాదనుకొని ఇక్కడ సీఎస్‌ఈ, ఈసీసీ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. ఇందులో సీటు వస్తే కొలువు ఖాయమని విద్యార్థులు భావిస్తుంటారు. ఏటా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య పెరగడం శుభ పరిణామం. 2021 సంవత్సరంలో వెయ్యి మంది ఉద్యోగాలు పొందగా, అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 62.5 లక్షలు. ఇక 2022 ఏడాది 1050 మంది ఎంపికైనట్లు నిట్ సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అధికారి తెలిపారు.
డిగ్రీకి లక్ష, బీటెక్‌కు లక్షన్నర... ఏదైనా క్షణాల్లో రెడీ... అసలేంటీ కథ?