హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద సిబ్బంది రెండుసార్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. మామూలుగా వాహనదారుల్లో కొందరు ఫాస్టాగ్ కార్డు ద్వారా టోల్ ఫీజు కడుతుంటారు. ఇక్కడ మాత్రం.. ఫాస్టాగ్ కార్డ్ స్వైప్ చేసిన తర్వాత కూడా.. కార్డు పని చేయడం లేదంటూ.. డబ్బులు గుంజుతున్నారు. ఫాస్టాగ్ కార్డులో డబ్బులు చెల్లించినట్టు మొబైల్‌కి వచ్చిన మెసేజ్ చూసుకొని.. వాహనదారులు సిబ్బందిని ఇదేంటని అడగగా.. తెల్ల మొహాలు వేశారు. ఇలా.. ఎంతమంది నుంచి ఒకే వాహనానికి రెండు సార్లు టోల్‌ప్లాజా వసూలు చేస్తారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టోల్‌ప్లాజా మేనేజర్ సతీష్ వాహనదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని.. రెండుసార్లు చెల్లించిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని నచ్చజెప్పారు. సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తిందని.. మరోసారి ఇలా జరగకుండా సవరిస్తామని సతీష్ తెలిపారు.