భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు పుట్టిపెరిగిన ఇల్లు ఇప్పుడు మ్యూజియంగా మారబోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన నివాసంలో ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. పీవీ అమితంగా ఇష్టపడే మహాత్ముడి విగ్రహంతోపాటు వినియోగించిన కుర్చీ, చూసిన టెలివిజన్, పీఎంగా పీవీ అందుకున్న జ్ఞాపికలను ప్రదర్శనశాలలో భద్రపర్చునున్నారు.
శతజయంతి ఉత్సవాల నాటికి...
మ్యూజియం కోసం 2 అంతస్తుల్లో 5 గదులను సిద్ధం చేస్తున్నారు. దిల్లీలో ఉన్న పలు వస్తువులను పీవీ మరణానంతరం హైదరాబాద్లో భద్రపరిచారు. ఇప్పుడు ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వంగరకు తరలించారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇంటిని మ్యూజియంగా మారుస్తున్నట్లు పీవీ తనయుడు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్ 28 న పీవీ శతజయంతి నాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.