ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్పేంటని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రశ్నించారు. హామీల అమలులో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈటల రాజేందర్ భాజపాలో చేరిన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో జమున పర్యటించారు. అక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు గ్రామస్థులు, నాయకులు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆమె గ్రామస్థులతో కలిసి పలు వాడల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు.
అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..
తమ ఆస్తులను కాపాడుకునేందుకే భాజపాలో చేరారని పలువురు ఆరోపిస్తున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. భాజపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామీణులకు వివరించారు. ప్రజల అభిమానానికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు. పలువురు గ్రామస్థులు భాజపాలో చేరగా, వారికి ఆమె పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: BABY MURDER: పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది..