Relation Between Olive Oil and Demetia: మతిమరుపు (డిమెన్షియా) ఇప్పుడు చాలా మందిని హడలెత్తిస్తోంది. గతంలో వృద్ధాప్యంలోనే తలెత్తే ఈ మతిమరుపు సమస్య.. ఇటీవల యుక్త వయసు వారిలోనూ కనిపిస్తోంది. దీనివల్ల వ్యక్తుల ఆలోచనా తీరునూ దెబ్బతీస్తుంది. ఫలితంగా ప్రవర్తన, మాటతీరు, కదలికలు అన్నీ మారిపోతాయి. అయితే.. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఆలివ్ ఆయిల్ ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ పరిశోధన కూడా నిర్వహించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
డిమెన్షియా అంటే ఏమిటంటే: డిమెన్షియా అనేది మెదడులోని నరాల కణాలు నాశనమవడం వల్ల కలిగే ఒక పరిస్థితి. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచించే శక్తి తగ్గుతుంది. డిమెన్షియాకు అనేక కారణాలు ఉండవచ్చు. అందులో అల్జీమర్స్ ప్రధానమైనది. మెదడులో అమిలాయిడ్, టావు అనే రెండు రకాల ప్రోటీన్లు అసాధారణంగా పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేసి, చిత్తవైకల్యానికి దారితీస్తాయి. ఈ చిత్తవైకల్యం పలుసార్లు మరణానికి దారి తీస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకునేందుకు ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు సహా ఇతర పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి, చిత్తవైకల్యంతో మరణించే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఓ బృందం వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(Journal of the American Medical Association)లో ప్రచురితమయ్యాయి.
పరిశోధన వివరాలివే: ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సుమారు 92వేల మందికి పైగా వ్యక్తుల నుంచి డేటా సేకరించారు. దాని ప్రకారం.. ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించని వారితో పోలిస్తే.. ఆలివ్ నూనెను రోజుకు 7 గ్రాముల కంటే ఎక్కువ వినియోగించే వారిలో చిత్తవైకల్యంతో మరణించే ప్రమాదం 28% తక్కువని కనుగొన్నారు. ఇదే విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ సంస్థ వెబ్సైట్లో ప్రచురించింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఆలివ్ ఆయిల్ ఇతర ప్రయోజనాలు:
చెడు కొలెస్ట్రాల్: ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకునే వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం క్రమంగా తగ్గినట్లు పలు పరిశోధనల్లో రుజువైందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పాలీఫినాల్ అనే ఔషధం.. రక్తనాళాలు, గుండె కవాటాల్లో చేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుందని.. ఫలితంగా గుండెపోటు, బరువు పెరగడం.. వంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు.
గర్భాశయ క్యాన్సర్: స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలన్నా, దీనికి ఆరంభంలోనే చెక్ పెట్టాలన్నా ఆలివ్ నూనె వాడకం మంచి మార్గమంటుననారు. ఆలివ్ నూనెను ఆహారంలో భాగం చేసుకున్న వారిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు తక్కువని పరిశోధకులు నిర్ధరించారు.
పేగు క్యాన్సర్: ఆలివ్ నూనె పేగు క్యాన్సర్‌ను నివారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. పేగు కణాల్లో పేరుకుపోయే అధిక కొవ్వును నియంత్రించే గుణం ఈ నూనెకు ఉందని.. అలాగే వాటి మధ్య కణతులు ఏర్పడకుండా అడ్డుకుని, క్యాన్సర్‌ని కలిగించే కణాలను నాశనం చేసే సామర్థ్యం కూడా ఉందంటున్నారు.
చర్మ సమస్యలు: కొందరి చర్మం పొడిబారిపోయి దురద పెడుతూ ఉంటుంది. సమస్య తీవ్రరూపం దాల్చితే, పొట్టు రూపంలో ఊడిపోతుంది కూడా. ఇలాంటి వారు స్నానానికి 15 నిమిషాల ముందు ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేసుకుంటే త్వరగా ఉపశమనం పొందచ్చని అంటున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది