వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్డౌన్ మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకుగాను బైక్ పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గల్లీలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ప్రత్యేక బైక్ పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్ ఆధ్వర్యంలో ఈ బృందం విధులు నిర్వహించనుంది.
అవగాహన, జరిమానాలు..
ఈ పెట్రోలింగ్ బృందం ముఖ్యంగా కాలనీలు, వీధుల్లో రోడ్లపైకి ఎలాంటి కారణం లేకుండా వచ్చే వాహనదారులను, ప్రజలను నియంత్రిస్తోంది. నగరంలోని వివిధ వీధులు, కాలనీల్లో ఆకస్మికంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనాదారులకు జరిమానాలతో పాటు వాహనాలను సైతం సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించనున్నారు. ప్రజలకు లాక్డౌన్ పట్ల మరింత అవగాహన కల్పించటంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు రావడం వల్ల కలిగే నష్టాలపై పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు వివరించనున్నారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: మిత్రుని ప్రాణాలు తీసిన బైకర్ దుస్సాహసం