Delay In Double Bedroom Houses Distribution Joint Warangal : రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. వరంగల్ జిల్లాలో పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. మరికొన్ని చోట్ల పూర్తైనా ఇళ్ల మంజూరులో జాప్యం జరిగింది. ఉండటానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ఆలస్యం కావడంతో... చివరికీ ఏం చేశారంటే.!
నిర్మాణం పూర్తైనా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం : హనుమకొండ జిల్లాకు పదేళ్ల క్రితం గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల వద్దకు అప్పటి సీఎం కేసీఆర్ (KCR) వచ్చి బాగోగులు తెలుసుకున్నారు. వారి కష్టాలను చూసి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించడంతో కేసీఆర్ హామీ మేరకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలు మంజూరయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బాలసముద్రంలోని ఏషియన్ మాల్ సమీపంలోని శిఖం భూమిలో ఒక్కో బ్లాకులో 10 చొప్పున మొత్తం 57 బ్లాకుల్లో నిర్మించారు. 582 మంది లబ్దిదారులకు కేటాయించేలా 2019లో పూర్తి చేశారు. నిర్మాణం పూర్తైనా లబ్దిదారుల ఎంపికలో జాప్యం జరగ్గా ఐదేళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని గుడిసెవాసులు వాపోతున్నారు.
"తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇస్తామన్నారు. దీంతో 600 కుటుంబాలు పాత నివాసాలను ఖాళీ చేశాం. 13 ఎకరాలను విడిచి దూరంగా గుడిసెలు వేసుకొని ఉన్నాం. రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి, పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. 2018లో డబుల్ బెడ్ రూం నిర్మాణాలను పూర్తిచేసిన ఇప్పటివరకు ఇవ్వలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి, హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత వాగ్దానాన్ని పెడచెవిన పెడుతోంది." -స్థానికులు
Double Bedroom Houses Issue In Telangana : వరంగల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 6300 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కాగా కేవలం 2000లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తైనా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించి లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Double Bed Room Houses Distribution: లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
"20 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. వానలకు, దోమల వల్ల జర్వాలు వ్యాపిస్తున్నాయి. ఇళ్లు ఇస్తామని 10 సంవత్సరాల నుంచి చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వం పక్కా భవనాలు కట్టించినా వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. అధికారులు వెంటనే నిర్మించిన భవనాలను అర్హులకు కేటాయించాలని కోరుతున్నాం."-స్థానికులు
'రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి'
Double Bedroom Scheme : నిరుపేదల 'డబుల్' కల.. ఇప్పట్లో తీరేనా?