వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు రైతులను నిండ ముంచాయి. గత ఆగస్టు 15 నుంచి పది రోజుల పాటు కురిసిన వర్షాలు.. అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయగా.. తాజా భారీ వర్షాలు రైతన్నకు కన్నీళ్లు మిగిల్చాయి. కోతలకు సిద్ధమైన వరిపై పిడుగులా పడిన వర్షం కర్షకుల వెన్ను విరిచేసింది. పచ్చని పొలాల్లోని పంటలు నేలవాలి ఎందుకు పనికిరాకుండా పోయాయి. పత్తి కాయలు పూర్తిగా నల్లబడి.. రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావటంతో రైతుకు ఏం చేయాలో పాలుపోవట్లేదు.
వేల ఎకరాల్లో నష్టం
వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 9,417 ఎకరాల్లో వరి నీట మునిగింది. ఇక 2,503 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. మొత్తం 11,952 ఎకరాల మేర నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 8,451 మంది రైతులు వర్షాల వల్ల నష్టపోయినట్లు తెల్చారు. ఇటు గ్రామీణ జిల్లాలోనూ భారీగా పంటలు నీటమునిగాయి. మొత్తం 61,720 ఎకరాల మేర పంటలకు వర్షంతో నష్టం వాటిల్లగా.. ఇందులో 5,671 ఎకరాల వరి, 55 వేల 438 ఎకరాల పత్తి ఉంది.
ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి
జనగామ జిల్లాలో కూడా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 16,673 ఎకరాల్లో వరి పంట నీట మునగ్గా.. 10,015 ఎకరాల్లో పత్తి దెబ్బతింది. మహబూబూబాద్ జిల్లాలో 1,620 ఎకరాల పత్తి, 2,590 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. మొత్తం నాలుగు జిల్లాల్లోనూ.. 800 ఎకరాల్లో కంది, మిర్చి, పెసర, సోయా, పల్లీ వర్షానికి నీట మునిగాయి. పంట నష్టంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో జరిగిన నష్టానికి అధికారులు లెక్కలు తీసుకున్నారు కాని.. ఎలాంటి సాయం అందించలేదు. ఈసారైనా తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు
ఇదీ చదవండి: రెండు రోజుల క్రితం గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం