కంటికి కనిపించని మహమ్మారి సృష్టించిన పెను ప్రళయం నుంచి ఇంకా ప్రపంచ దేశాలు తేరుకోవట్లేదు. రోజూ లక్షలకొద్దీ కేసులు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయ్. అన్నెం పున్నెం ఎరుగుని ఎంతోమంది...మహమ్మారి కాటుకు బలయ్యారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి...దేశాలు కుదేలయ్యాయి. కరోనా సృష్టించిన ఉత్పాతాన్ని....కాన్వాస్ పై గీసి అవగాహన కలిగిస్తున్నారు ఓరుగల్లుకు చెందిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు చంద్రమౌళి.
ఓ ప్రైవేటు స్కూల్లో డ్రాయింగ్ మాస్టారుగా పనిచేస్తున్న చంద్రమౌళి...ఇప్పటికే కరోనాపై అవగాహన కలిగించేందుకు...ఓరుగల్లు చిత్రకారులతో కలిసి రోడ్లపై ఎన్నో చిత్రాలు గీశారు. ఇప్పుడు స్వయంగా కాన్వాస్ పైనా గీస్తూ అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కర్కశంగా కరోనా చేసిన దాడితో గాయపడి కన్నీరు పెడుతున్న భూమాతకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం, లాక్‌డౌన్‌తో కరోనా కట్టడి, ఇల్లు దాటితే కలిగే అనర్థం...కరోనా నేర్పిన పాఠాలు, ప్రాణదాతల కృషి...తదితర అంశాలను అందమైన చిత్రాలుగా మలచి అందరి ప్రశంసలూ పొందుతున్నారు.
కరోనా కట్టడి చేసేందుకు మన దేశం విజయం సాధించింది. ఈ విజయం వెనక చాలా కృషి ఉంది. వైద్యులు, పోలీసులు చేసిన సేవను వివరిస్తూ కొన్ని బొమ్మలు గీశాను. ఒక చిత్రకారుడుగా సమాజానికి నా వంతు కృషి ఎంతో అవసరమనుకుని నేను చిత్రాలు గీస్తున్నాను. -చంద్రమౌళి, డ్రాయింగ్ మాస్టర్
తన ఆలోచనలకు రంగులద్ది... గీసిన చిత్రాలన్నింటితో కలిసి ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తానంటున్నారు చంద్రమౌళి. లాక్డౌన్ సడలింపులప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలని...ప్రజలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో తెలియజెప్పేందుకు మరికొన్ని బొమ్మలు గీయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు