కంటికి కనిపించని కరోనా ప్రజలకు 8 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రారంభంలో లాక్డౌన్ ఆ తర్వాత కొవిడ్ పరీక్షలు పెంచి... ముమ్మరంగా చికిత్సలందించడం వల్ల గత కొంత కాలంగా వైరస్ తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో వచ్చిన అవగాహన ఫలితంగా కొవిడ్ వ్యాప్తి తగ్గింది. గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా తక్కువ కేసులే నమోదవుతున్నాయని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు జి.శ్రీనివాస రావు తెలిపారు. ఓరుగల్లులో ఉమ్మడి జిల్లా వైద్యశాఖాధికారులతో సమావేశమై.. కరోనా నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.
ప్రభుత్వ చర్యలతో వైరస్ ఉద్ధృతి తగ్గిందన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా.. 0.55 శాతమే ఉందని తెలిపారు. రోజుకు 45 నుంచి 50 వేల పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తి తగ్గిందనుకుని.. అజాగ్రత్తగా ఉంటే ముప్పుతప్పదని హెచ్చరించారు. దీపావళి, సంక్రాంతి పండుగల సీజన్‌తోపాటు.. చలికాలం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్ వస్తుందనుకుంటూ అజాగ్రత్తగా ఉండటం సరికాదన్నారు. అనేక దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని.. ఇక్కడ పెరగకుండా ఉండాలంటే.. కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించండి: బాధితులు