Bandi Sanjay on wardhannapet food poison incident : వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఆ బాలికలను హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ రెండు నెలల్లో గురుకులాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్న ఆయన.. గురుకులాల్లో కనీస వసతులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో గత రాత్రి భోజనం చేస్తుండగా.. ఒకరి పళ్లెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్ వద్దకు చేరుకుని.. విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
కడుపు నొప్పి, వాంతులతో పరిస్ధితి అందోళనకరంగా ఉన్న 13 మంది విద్యార్థులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉంది. అప్రమత్తమైన వైద్యాధికారులు విద్యార్థులందరికీ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ గోపి ఆసుపత్రికి వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వరంగల్ ఎంజీఎంకు తరలివచ్చారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారందరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.