MGM: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగి శ్రీనివాస్‌పై ఎలుకల దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎజిల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసి ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ తొలి సంతకం పెట్టారు. గత నెల 31న జరిగిన ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెంటనే విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సూపరింటెండెంట్ వి.శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. మరో ఇద్దరు వైద్యులను కూడా సస్పెండ్ చేశారు.
నోటీసులు బేఖాతరు: ఎలుకల దాడికి సంబంధించి పారిశుద్ధ్య పనులు నిర్వహించే ఏజెన్సీని ఎందుకు వదిలేశారంటూ విమర్శలు వెల్లువెత్తవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎజిల్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణలో ఎజిల్ సంస్థ ఘోరంగా విఫలమైందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 2, మార్చి 15న ఇదే అంశంపై రెండు సార్లు నోటీసులిచ్చినా ఏజెన్సీ నిర్లక్ష్యం ప్రదర్శించి ఒప్పంద నిబంధనలను ఉల్లఘించిందని తెలిపారు.
ఏజెన్సీ నిర్లక్ష్యం: ఆస్పత్రిలో ఆరోగ్య పర్యవేక్షకుడు లేకపోవడం ఇప్పటికీ కొరతగానే ఉంటోంది. ఆస్పత్రిలో 1300 పడకలు, 2 వేల మంది వైద్య సిబ్బంది ఉండగా.. నిత్యం మూడు వేలకుపైగా రోగులు వస్తుంటారు. మరో వెయ్యి మందికిపైగా వార్డుల్లో చికిత్స పొందే రోగులు, వారి కుటుంబసభ్యులు, సహాయకులతో కిటకిటలాడే ఎంజీఎం ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి సరఫరా వ్యవస్ధ సక్రమంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ తరఫున పనిచేసే సూపర్ వైజర్లు, సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా పలు సార్లు నోటీసులిచ్చినా బేఖాతరు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ వారిపైన పూర్తి బాధ్యత మోపడంతో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది.
హెల్త్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ప్రధాన కారణం: కొవిడ్ సమయంలో జనగామ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెల్త్ ఇన్స్పెక్టర్ను డిప్యూటేషన్‌పై ఎంజీఎంకు తీసుకొచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆ తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే ఆయనను తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించేవారే కరువైపోయారు. ఇప్పటికైనా ఎలుకల దాడులు పునరావృతం కాకుండా తక్షణమే హెల్త్ ఇన్స్పెక్టర్ను నియమించాల్సిన ఆవసరముందని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: