Waterfalls Climbing: జల జల జారే జలపాతాలు చూస్తే ఎవరైనా సరే ప్రపంచాన్ని మైమరిచిపోయి ఆనందంగా విహరించాల్సిందే. కానీ ఈ యువకుడు... ఊరికే చూసి సంతోష పడటం కాకుండా సాహసాలు చేస్తున్నాడు. పైనుంచి వేగంగా జలధారలు పడుతున్నా అంతే వేగంగా వాటికి ఎదురెళ్తున్నాడు. భయం అన్నదే లేకుండా.. వాటర్‌ఫాల్స్ క్లైంబింగ్‌ని ఆటగా మార్చుకున్న ఇతడే.. వరంగల్‌కు చెందిన ప్రవీణ్. చిలువేరు ప్రవీణ్ కుమార్ ఎంబీఏ పూర్తిచేశాడు. రాక్ క్లైంబింగ్‌లో శిక్షణ పొందాడు. ప్రాణాలతో చెలగాటమని తెలిసినా ఎలాంటి భయం లేకుండా అవలీలగా సాహసాల్ని చేస్తున్నాడు.
ఉమ్మడి జిల్లా నుంచి మొదటి స్థానంలో..: కె.రంగారావు సారథ్యంలో ప్రారంభమైన 'అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్'లో ప్రవీణ్ శిక్షణ పొందాడు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రవీణ్ మొదటి స్థానంలో నిలిచాడు. విశాఖలో 300 అడుగుల ఎత్తైన జలపాతం వద్ద విన్యాసాలు చేశాడు. అలా వాటర్‌ఫాల్ డౌన్ ర్యాప్లింగ్ రివర్స్ ర్యాప్లింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
అత్యుత్తమ ప్రదర్శన: రెండేళ్ల క్రితం.. ఆదిలాబాద్‌లోని మిట్ట జలపాతం వద్ద నిర్వహించిన వాటర్‌ఫాల్ క్లైంబింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2021లో మహబూబాబాద్‌లోని ముల్క నూరులో 2 వేల అడుగుల కొండ పైకి ఎక్కడం, దిగడంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానం దక్కించుకున్నాడు.
ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు: వాటర్‌ఫాల్ క్లైంబింగ్‌పై డాక్యుమెంటరీ రూపొందించాలని అనుకున్నాడు ప్రవీణ్. మిత్రులతో కలిసి లఘు చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సాహసాలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఎవరైనా సాయమందిస్తే...మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. క్లైంబింగ్‌లోనే ఆనందం వెతుక్కుంటున్న ప్రవీణ్..ఎవరెస్టు ఎక్కడమే లక్ష్యంగా పెట్టుకుని అందుకు తగినట్టుగా సాధన చేస్తున్నాడు.
'సాధారణ ర్యాప్లింగ్‌కు, వాటర్ ర్యాప్లింగ్‌కు తేడా ఏంటంటే.. వాటర్ వేగంగా రావడం వల్ల మనకు ఎక్కాలనే ఉత్సాహం చాలా ఉంటుంది. అలాగే మనం ఎంత ధైర్యంగా ముందుకు వెళుతున్నామనేది అందులో కనిపిస్తుంది. రివర్స్ ర్యాప్లింగ్‌లో భయాన్ని అధిగమిస్తే తప్ప మనం దానిని అధిరోహించలేం.' -ప్రవీణ్ కుమార్
ఇదీ చదవండి: