Father tried to Kill daughters in Jangaon : రాష్ట్రంలో రోజురోజుకి ఆఘాయిత్యాలు పెరిపోతున్నాయే కానీ, తగ్గట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య అనుమానాలతో అనేక గొడవలు అవుతున్నాయి. కొంత మంది చిన్న చిన్న మనస్పర్ధలను భూతద్ధంలో చూస్తూ.. వారి సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి చెప్పిందే చేయాలి, జరగాలని మూర్ఖంగా ప్రవర్తిస్తూ.. తమ జీవితాలనే కాకుండా పిల్లల భవిష్యత్‌ను పాడుచేస్తున్నారు.
కొన్నిసార్లు చావడమో.. లేక ఎదుటివాళ్లను చంపడమో చేస్తూ వారి జీవితాన్ని అంధకారం చేసుకోవడమే గాక.. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు పిల్లలు బలయ్యారు. భార్యతో గొడవపడిన భర్త.. ఆమెపై కోపంతో తన కుమార్తెలను చంపడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఒక కుమార్తె మరణించగా.. మరో కూతురు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అసలేం జరిగిందంటే.. ?
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి శివారు జానకిపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మీ -శ్రీనివాస్ దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు ఉన్నారు. పిల్లలు పుట్టేంత వరకూ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. బాబు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చీటికిమాటికి గొడవపడటం షురూ అయింది. అలా తరచూ ధనలక్ష్మీ, శ్రీనివాస్‌లు గొడవపడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆదివారం రోజు రాత్రి మరోసారి ఈ దంపతులు గొడవపడ్డారు. కోపంతో ధనలక్ష్మీ తన పిల్లలను అక్కడే వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
ధనలక్ష్మీ పుట్టింటికి వెళ్లడంతో శ్రీనివాస్ కోపోద్రిక్తుడయ్యాడు. ఎలాగైనా భార్యను తన ఇంటికి రప్పించాలనుకున్నాడు. దానికోసం ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఓ దుర్మార్గమైన పథకం రచించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత రాత్రి ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. పిల్లలిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. భయపడి వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ పెద్దు కుమార్తె నందిని మృతి చెందగా.. చిన్నకూతురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కుటుంబ కలహాల కారణంగా తన భర్త తన పిల్లలపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ధనలక్ష్మీ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద కుమార్తె మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
' మాపెద్ద అమ్మాయికి 8 సంవత్సరాలు, చిన్న అమ్నాయికి 6 సంవత్సరాలు. నా భర్తకు నాకు గొడవలు ఎప్పడూ అవుతూనే ఉంటాయి. అయినా నేను పిల్లల కోసం సర్థుకుపోయాను. వాళ్ల కోసమే అన్నీ భరిస్తూ వచ్చాను. పిల్లల ముందు మీ అమ్మని చంపుతానని మందు చూపించి చెప్పాడంటా. అమ్మ నిన్ను నాన్న చంపుతా అన్నాడు. నాన్న ఏం ఇచ్చినా తీసుకోకు అని నాకు చెప్పారు. అది ఆయన విన్నాడు. నా బిడ్డలు నాకు అన్నీ చెబుతున్నారని తెలుసుకున్నాడు. అందుకేనేమో నా బిడ్డలకు పురుగుల మందు ఇచ్చి చంపాలనుకున్నాడు. -మృతురాలి తల్లి, ధనలక్ష్మీ
ఇవీ చదవండి: