రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీటీసీలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంపీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో మూకుమ్ముడిగా పోటీ చేస్తామని ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఉత్సవ విగ్రహాలను చేస్తున్నారు...
పల్లె ప్రగతిలో కూడా తమకు నిధులు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని వాసుదేవరెడ్డి తెలిపారు. వార్డుమెంబర్లకు ఇచ్చిన గౌరవం కూడా తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హూజూరాబాద్ ఉపఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేసి తమ ప్రాధాన్యతను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
మా సత్తా నిరూపించుకుంటాం...
"నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఏవీ అమలు కావటం లేదు. కేలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలోని ఏ కుటుంబానికి ఉద్యోగం రాలేదు. ఎంపీటీసీలను అసమర్థులుగా చిత్రీకరిస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సమయం వచ్చింది. ఆత్మగౌరవంతో తెచ్చుకున్న రాష్ట్రంలో అడుగడుగా.. ఎంపీటీసీలకు జరగుతున్న అవమానాలను దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్ ఎన్నికల బరిలో దిగుతున్నాం. సుమారు ఎనిమిది వందల మంది ఎంపీటీసీలం మూకుమ్మడిగా నామినేషన్ వేయనున్నాం. మా సత్తా నిరూపించుకుని... సమర్థులమని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఎన్నికలప్పుడు మాత్రమే తీసుకొచ్చే వాటిని పథకాలనరు. ఓట్ల కోసం తీసుకొచ్చే దళిత బంధును స్కీం అనరు. అదో పెద్ద స్కాం. ప్రభుత్వం చేసే మోసాలను ప్రతీ వాడ తిరిగి ప్రచారం చేస్తాం." -వాసుదేవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
సర్కారుకు గుణంపాఠం చెప్తాం...
తమపై చిన్నచూపు చూస్తోన్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఏడెనిమిది వందల మంది ఎంపీటీసీలు మూకుమ్మడిగా నామినేషన్లు వేసి.. తమ సత్తా చాటుతామని తెలిపారు. రెండేళ్ల నుంచి నిధులు లేక నిరుపయోగంగా ఉన్నామని... ప్రభుత్వం తమను నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. తమ పరిస్థితిని గతంలో ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని వాపోయారు.
ఇవీ చూడండి:
Huzurabad By Election: సర్వత్రా ఉత్కంఠ.. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు?
'హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు దళిత బంధు నిలిపేయండి'
Corona Hotspot : మరో కరోనా హాట్‌స్పాట్‌గా హుజూరాబాద్ నియోజకవర్గం