young man committed suicide in Warangal: గత కొంత కాలంగా పోలీసుల విచారణలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో క్రమంగా పెరిగిపోతున్నాయి. గత నెల వ్యవధిలో మెదక్ జిల్లాలోనే ఇలాంటి ఘటనలు రెండు చూశాం. పోలీసుల థర్డ్ డిగ్రీతో ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి మరణించగా.. ఆ తరువాత కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు కొట్టారని కారణంతో యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చూశాం. ఇప్పుడు అలాంటి తరహా ఘటనే వరంగల్ జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది.
ఇది జరిగింది: పోలీసులు విచారణకు పిలిచారని అవమానాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి వరంగల్‌లో యువకుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన కుమారస్వామి ఇంట్లో ఈనెల 1వ తేదీన దొంగతనం జరిగింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కుమారస్వామిని పోలీసులు విచారించగా.. ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించారు. దీనికి అతను తన కుమారుడు మనోజ్‌తో పాటు అతని స్నేహితుడు వంశీ కృష్ణ మీద అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో సోమవారం గీసుకొండ పోలీసులు వంశీని విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ.. పురుగులు మందు తాగి విచారణకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టేషన్ ముందుకు రాగానే కుప్పకూలిపోయాడు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృత దేహాన్ని మార్చురీకి తరలించారు.
ఈ ఘటనతో స్థానికులు, వంశీ కుటుంసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయారని... బాధ్యులపై పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలు ఖండించారు. బాధితుడు చేసిన ఫిర్యాదులో భాగంగానే విచారణ కోసం పిలిచామని చెబుతున్నారు. అయితే విచారణ పేరుతో కొట్టడం, తిట్టడం వల్లే తమ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వంశీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
ఇవీ చదవండి:
పోలీసులు కొట్టారని కరెంట్ తీగలు పట్టుకున్నాడు.. చివరకు?
తాగి బైక్ నడిపాడు.. పోలీసులు పట్టుకోగానే తగులబెట్టేశాడు
చైన్ దొంగిలించాడనే అనుమానంతో పోలీసుల థర్డ్ డిగ్రీ..! స్పందించిన డీఎస్పీ
హరిహరా... స్నేహితురాలి ఇంట్లో స్నానం.. ఆమెతో రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ!