వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి. ప్రయాణికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కూర్చునేందుకు కుర్చీలు... రాత్రైతే వెలుతురు కరువు. ఆ ప్రాంగణం కుక్కలు, పందులకు నెలవుగా మారింది.
చినుకు పడితే చిత్తడే...
వర్షాలు పడితే ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో మొరపెట్టుకుంటే అప్పుడప్పుడు ఓ నాలుగు ట్రాక్టర్ల మట్టి పోసి మమ అనిపించుకుంటారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్ లోపలికి బస్ రావాలన్నా... పోవాలన్న ప్రయాణికులకు, డ్రైవర్లకు కత్తి మీద సాముగా మారింది. 20 ఏళ్ల క్రితం చేసిన పనులే తప్ప... ఇప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేవని ప్రయాణికులు అంటున్నారు.
అసంతృప్తి...
వర్ధన్నపేట మీదుగా నిత్యం వందలాది బస్సులు ప్రయాణిస్తూ ఉంటాయి. కొన్ని సర్వీసులైతే గుంతల కారణంగా బస్టాండ్‌లోకి రాకుండానే వెళ్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేరుకే బస్టాండ్ అని ఎలాంటి సౌకర్యాలు లేవని ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్పందించాలి...
బస్ వెనుక మరో బస్ వస్తే... పెద్ద ఎత్తున లేచే దుమ్ముతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు. గుంతలమయంగా మారిన బస్టాండ్‌లోకి రావడమమంటే ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుకోవడమే వాపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా బస్టాండ్ ఇలాగే ఉందని ఇప్పటికైనా... అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రాంగణాన్ని బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.!