వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎరువుల కొరత రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఒక్కో చేనులో రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉన్నా కొరతతో సగమే వేస్తున్నారు. పాకాల ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి వేశారు. ఎరువుల కోసం ఖానాపురం వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఉదయం ఆరు గంటల నుంచే బారులు తీరుతున్నారు.
రెండు బస్తాలు మాత్రమే
ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడం వల్ల యూరియా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున్నే చంటిపాపలను వదిలిపెట్టి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని మహిళా రైతులు వాపోతున్నారు. ఎంతో దూరం నుంచి వస్తే అప్పటికే బస్తాలు ఉండడం లేదని అన్నదాతలు చెప్పారు. ఎరువులు వేసే సమయం దాటి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'చంద్రయాన్-2 ల్యాండర్, రోవర్‌పై ఆశలు గల్లంతు'