Smitha Sabharwal infront of Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకతవకలు జరిగాయనే విచారణలో భాగంగా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈరోజు (డిసెంబరు 19)న హాజరయ్యారు. దీనిపై స్మితా సభర్వాల్ గత ప్రభుత్వ సీఎంఓ కార్యలయంలో పదేళ్ల పాటు కార్యదర్శిగా పనిచేస్తూ, ఏడు శాఖలను పర్యవేక్షించినట్లు కమిషన్‌కు వివరించారు. సాంకేతిక అంశాల జోలికి వెళ్లలేదని ఆయా శాఖలను సమన్వయం మాత్రం చేశానని జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్ పర్మిషన్ లేకుండానే జీవోలు వచ్చాయా? అని ప్రశ్నలు సంధించగా, ఆ విషయం తనకు తెలియదని స్మిత సమాధానమిచ్చారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల నిర్మాణ అనుమతులు, మంత్రి మండలి సమావేశాల్లో మీ పాత్ర ఏంటి? అని ప్రశ్నించగా ఫైళ్లను పరిశీలించడం వరకే తన విధి అని ఆమె కమిషన్‌కు తెలిపారు. వివిధ శాఖలు, సీఎస్ నుంచి వచ్చే ఫైళ్లను ముఖ్యమంత్రికి క్లుప్తంగా వివరించడం తన బాధ్యత అని ఆమె వివరించారు. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సభర్వాల్ తెలియదు, గుర్తులేదు, అవగాహన లేదు అనే సమాధానం ఇవ్వడం గమనార్హం.
కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ : స్మితా సభర్వాల్ అనంతరం మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ముఖ్యంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లకు సంబంధించిన అనుమతుల గురించి ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. బ్యారేజ్ నిర్మాణంలో అంతా సరిగ్గానే జరిగిందా? అని సోమేశ్‌ను కమిషన్ ప్రశ్నించగా, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, కార్యదర్శి వాటిని పర్యవేక్షించారని సోమేశ్ కుమార్ సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి వార్తా పత్రికల్లో చదివేవాడినని పేర్కొన్నారు.
తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించక ముందే బ్యారేజ్‌ల నిర్మాణం కంప్లీట్ అయ్యిందని సోమేశ్ కుమార్ సమాధానం చెప్పారు. వాటి అనుమతులు, క్యాబినెట్ నిర్ణయించిన తీర్మానాల గురించి తనకు తెలియదని కమిషన్‌కు వివరించారు. బ్యారేజీలకు సంబంధించి ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? అని కమిషన్ ప్రశ్నించగా, చాలా ఏళ్లు గడిచింది అని గుర్తుకు లేదని సోమేష్ కుమార్ సమాధానమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంపై ఆర్థిక భారం అనిపించలేదా? : బ్యారేజీల వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని మీకు అనిపించలేదా? అని ఘోష్ కమిషన్ ప్రశ్నించగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ విషయాలను చూసుకుంటారని సోమేశ్ సమాధానమిచ్చారు. శాఖల అధిపతులే చూసుకున్నారంటే, సీఎస్‌గా మీ బాధ్యత ఏంటి? అని కమిషన్ మళ్లీ ప్రశ్న వేసింది. ఫైల్స్ పరిశీలించి లోటుపాట్లు ఉంటే సూచనలిస్తానన్న సోమేశ్‌కుమార్ జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో క్లియరెన్స్ అయిన దస్త్రాల పైన మాత్రమే సంతకం చేసినట్లు సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇతర శాఖల గురించి సోమేశ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేయగా, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల గురించి మాత్రమే చెప్పాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆయనకు సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవతవకలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత్రలు వహించిన ప్రభుత్వ అధికారులను విచారణకు పిలుస్తూ, పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతుంది. విచారణ పూర్తి కాగానే ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వం బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
'కేసీఆర్ చెప్పిన విధంగానే 'కాళేశ్వరం' నిర్మాణం - ఆయన ఎలా చెబితే అలా చేశాం'