ప్రపంచమంతా ఎలక్ట్రికల్ వాహనాల వైపు పరుగులు పెడుతోంది. వాతావరణ కాలుష్య నియంత్రణ, తరిగిపోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాలు వాడే వారి సంఖ్య పెరుగుతోంది. దేశీయ పరిశ్రమలూ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ప్రైవేటు సంస్థలే కాదు.. ఒక్కోసారి సామాన్యుడి ఆవిష్కరణలు ఆకట్టుకుంటాయి. ఈ కోవలోనిదే ఈ కథనం.
వరంగల్ గ్రామీణ జిల్లాలోని దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన రాజు ఎలక్ట్రికల్ సైకిల్‌ను ఆవిష్కరించాడు.. అవసరం, ఆలోచన, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా... దీనిని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్నప్పటి నుంచి ఆవిష్కరణలంటే ఎంతో ఆసక్తి ప్రదర్శించే రాజు... తన పరిశోధనలు పది మందికి చేరాలని తాపత్రయపడేవాడు. ఈ క్రమంలోనే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తనలో ఆలోచనలు రేకెత్తించాయి. తన ఆసక్తికి పని చెప్పాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ సైకిల్ తయారీయే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు.
రూ.8వేలతో ఎలక్ట్రికల్ సైకిల్
ఆలస్యం చేయకుండా.. వెంటనే సైకిల్ తయారీ ప్రక్రియ ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే సైకిల్‌కు బ్యాటరీలు, వైర్లు... అవసరమైన మార్పులు చేసి మోటారును అమర్చాడు. అవసరం మేరకు వేగం పెంచుకునే సౌకర్యం సైతం ఏర్పాటు చేశాడు. కేవలం 8 వేలతోనే ఈ సైకిల్ రూపొందించిన రాజు.... అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
సాధారణ సైకిల్లాగే...
గంట సేపు ఛార్జింగ్ చేస్తే... 20 కిలోమీటర్లు దూసుకుపోతోంది... ఈ సైకిల్. రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా.. తన విద్యుత్ సైకిల్‌నే వినియోగిస్తున్నాడు. ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోతే... సాధారణ సైకిల్ తొక్కినట్లు తొక్కుకుంటూ వెళ్లొచ్చని చెబుతున్నాడు.
మరికొన్ని ఆవిష్కరణలు
రాజు మరికొన్ని ఆవిష్కరణలూ చేశాడు. గడ్డి మొక్కల్ని సులువుగా కత్తిరించే యంత్రాన్ని తక్కువ ధరకే తయారు చేశాడు. బహిరంగా మార్కెట్‌లో ఈ పరికరం ధర రూ.15 వేలు ఉండగా... కేవలం 5వేలకే రైతులకు అందిస్తున్నాడు. సోలార్ లేదా కరెంటుతో ఛార్జింగ్ చేసి వినియోగించేలా దీనిని తీర్చిదిద్దాడు.
వీధిలైట్లకు విద్యుత్ సరఫరా సమయానుకూలంగా నియంత్రించే వ్యవస్థనూ రూపొందించాను. ఈ పరికరంతో విద్యుత్ వృథాను అరికడుతున్నాం. కేవలం రూ.3.5వేలకే తయారుచేసిన పరికరాన్ని... సుమారు 500 గ్రామాల్లో అమర్చాం.
-ముప్పారపు రాజు, విద్యుత్ సైకిల్ రూపకర్త
కొంత కాలంగా.. రాజుకు ప్రవీణ్ అనే యువకుడు తోడయ్యాడు. ఇద్దరూ కలసి మరిన్ని ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే అతితక్కువ ధరలకే నాణ్యమైన విద్యుత్ పరికరాలు రూపొందించగలనని ధీమాగా చెబుతున్నాడు రాజు.
ఇదీ చదవండి: బడ్జెట్ చూడడానికి బారెడు.. ఖర్చు మూరెడు: చాడ