వరంగల్ గ్రామీణజిల్లా మైలారం గ్రామంలో రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కూలీలు ఈటీవీ, ఈనాడు ప్రతినిధులకు తారస పడ్డారు. వారి బాధలు విన్న ఈటీవీ, ఈనాడు బృందం అదే ప్రాంతంలో పర్యటనలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమాచారం ఇచ్చారు. తెలుసుకున్న మంత్రి వలస కూలీలకు ఆహారం అందించాలని మైలారం గ్రామ సర్పంచ్‌ను సన్నద్ధం చేశారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి వలస కూలీల వద్దకు చేరుకుని వారి బాధలు విన్నారు.
సొంతంగా ఆర్థిక సహాయం
వెంటనే జిల్లా కలెక్టర్ హరితకు వారి పరిస్థితిని వివరించారు. ద్విచక్ర వాహనాలపై వారు వెళ్తూ మైలారం గ్రామంలో ఆగారని, వారికి ఏలా చేస్తే బాగుంటుందని కలెక్టర్‌ను అడిగారు. ఈ రోజుకు ఇక్కడే బసకు ఏర్పాట్లు చేశామని కూలీలతో మాట్లాడిన మంత్రి సొంతంగా ఆర్థిక సహాయం అందించి మాస్కులు పంపిణీ చేశారు.
కూలీల చప్పట్లు..
మంత్రి ఎర్రబెల్లి దాతృత్వానికి కూలీలు చప్పట్లు కొట్టి తమ అభిమానాన్ని తెలియజేశారు. తాము బతుకు దేరువుకోసం రాజమండ్రికి వెళ్లామన్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరూ తమను పట్టించుకోలేదని, అక్కడి ఎమ్మార్వో, కలెక్టర్లకు వినతులు ఇచ్చినా ఎలాంటి సాయం అందలేదని కూలీలు వాపోయారు. ఈటీవీ, ఈనాడు చొరవతో మంత్రి ఎర్రబెల్లి స్పందించి వారికి సహాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : అలా జరిగితే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్