Cotton Price in Telangana: వరంగల్ ఎనుమాముల మార్కెట్ తెల్లబంగారంతో కళకళలాడుతోంది. భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల నుంచి వస్తోన్న రైతులతో మార్కెట్ పరిసరాలు సందడిగా మారాయి. దాదాపు 9 వేల బస్తాలు మార్కెట్కు రాగా... ఎప్పుడూ లేనంతగా రికార్డు స్ధాయిలో క్వింటా పత్తి 8,800 రూపాయల ధర పలికింది. పరకాల మార్కెట్లో 50 రూపాయలు అదనంగా.. రూ.8,850 ధర పలికింది. ఓ మాదిరిగా ఉన్న పత్తికి 7,510 రూపాయలు, ఇంకాస్త బాగున్న పత్తికి రూ.8,200 ధర పలికింది. ఒక్కరోజులోనే మొత్తం 32 క్వింటాళ్ల మేర పత్తి కొనుగోలు జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పత్తికి మరింత మంచి ధర వచ్చింది. ఇక్కడ క్వింటా పత్తి.. 8,901 ధర పలకడం విశేషం. మొత్తం 278 క్వింటాళ్ల మేర పత్తి మార్కెట్కు వచ్చింది.
సగానికి సగం తగ్గిన దిగుబడి..
గతేడాది ఇదే సమయంలో.. పత్తి క్వింటా ధర కనీసం 6 వేలు కూడా దాటలేదు. ఈసారి మాత్రం సీజన్ ఆరంభం నుంచే పత్తి ధర బాగానే పలుకుతోంది. నవంబర్ మధ్యలో 7 వేలకు పైగా ధర ఉన్న పత్తి.. ఆ తరువాత ఏడున్నర వేలకు చేరుకోగా... ఇప్పుడు రూ.8,800కు చేరింది. పత్తికి రికార్డు ధరలు రావడంతో.. మార్కెట్లలో సీసీఐ కేంద్రాల అవసరమే లేకుండా పోయింది. గిట్టుబాటుకు మించి పత్తి ధర రావడం రైతులకు సంతోషం కలిగిస్తున్నా... ఆ మేరకు దిగుబడి లేకపోవడం విచారం కలిగిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి కురిసిన కుండపోత వర్షాలు.. పంట దిగుబడిని సగానికి సగంపైగా తగ్గించేశాయి. చాలా చోట్ల కాయాలు కుళ్లి, నేలరాలిపోయాయి. వర్షాలకు తెగుళ్లు కూడా తోడవడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గింది. మరోవైపు పెరిగిన కూలీ ఖర్చులు, ఎరువుల ఖర్చులూ పెట్టుబడిని రెట్టింపు చేశాయి. దీంతో పత్తికి మార్కెట్లో ధర ఉన్నా... అది దక్కించుకోలేకపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు.
పదివేలకు చేరినా ఆశ్చర్యం లేదు..
దిగుబడి తగ్గడం, అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటం.. తదితర కారణాలతో పత్తికి ఈ ఏడాది అధిక ధరలు పలుకుతున్నాయి. రైతులు గ్రేడింగ్ చేసి తీసుకొస్తే.. మరింత ఎక్కువ ధర వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. ముందు ముందు పత్తికి మరింత ధరలు పెరిగే అవకాశాలూ కనపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 15రోజుల్లో క్వింటా పత్తి ధర పదివేలకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరమే లేదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: