Explosions in granite quarry: ఈ దృశ్యాలు రష్యా... ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న బాంబుపేలుళ్లు కావు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లెలో జరిగిన క్వారీ పేలుళ్లవి. ఎప్పుడో ఓసారి కూడా కాదు. క్వారీ కోసం బాంబు పేలుళ్లు నిత్యకృత్యమవడంతో గ్రామస్థులు... బెంబేలెత్తిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో క్వారీలు... పరిసర గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి. 30 ఏళ్లుగా క్వారీలు నడుస్తున్నా... గతంలో పెద్దమొత్తంలో తవ్వేందుకు కంప్రెషర్ జాకీ విధానంలో రాయిని పగులగొట్టేవారు. ఇప్పుడు బోర్ బ్లాస్టింగ్ విధానంలో పేలుళ్లు చేపట్టడం ప్రమాదకరంగా మారుతోంది. భారీ ఎత్తున పేలుళ్లు చేపడుతున్నారు. క్వారీ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల మేర భూమి దద్దరిల్లిపోతోంది. రాళ్లు పడి ఇళ్లు దెబ్బతింటున్నాయి. రేకులు, గోడలు పగులుతున్నాయి. పంటలు సైతం నష్టపోతున్నామని రైతుల వాపోతున్నారు.
రాళ్లు మీద పడటంతో.. గ్రామస్థులు గాయపడిన సందర్భాలున్నాయి. తరచూ ఇళ్లు మరమ్మతులు చేసుకోలేక గ్రామస్థులు... నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు క్వారీలో పని చేసే కార్మికుల రక్షణకు సైతం యజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణ కరవవడంతో... పేలుళ్లు యథేచ్చగా జరుగుతున్నాయనే అభిప్రాయం పరిసర ప్రాంత ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. సిబ్బంది మామూళ్ల మత్తులో పడి, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని... అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పేలుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నామని.. ప్రాణాలు సైతం పోతున్నాయని అధికారులు ఇప్పటికైనా స్పందించి సమీప గ్రామాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: