గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని విలీన గ్రామాలకు మంత్రి కేటీఆర్ చొరవతో అధిక నిధులు కేటాయించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్లలో రూ.6.45 కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, కాలువలు, బీసీ, ఎస్సీ స్మశానవాటికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపం కనిపించకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధర్మారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం రంగ సంస్థలను విక్రయించడం తప్ప భాజపాకు ఏం చేతకాదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు.