అయ్యప్పస్వామి వారికి నిర్వహించే పంబారట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డి స్వయంగా రథం నడుపుతూ మాదన్నపేట చెరువుకట్టకు తరలించారు. ఆలయం నుంచి డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో అలరిస్తూ ఊరేగింపుగా వెళ్లారు.
అనంతరం చెరువులో స్వామివారికి జలక్రీడలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పంబారట్టు కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలలా నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అయ్యప్పస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. స్వామివారి ఆశీస్సులతో దేవాదుల నీటిని రంగయ్యచెరువు, పాకాల,మాదన్నపేట చెరువుకు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏసీపీ ఫణిందర్, భక్తులు పాల్గొన్నారు.